Thursday, 14 December 2017

          రోహిత్‌ 208: ఆనందబాష్పాలతో సతీమణి 


మొహాలి స్టేడియంలో టీమిండియా సారథి రోహిత్‌ శర్మ మోత మోగించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించి ద్విశతకం నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న రోహిత్‌ను చూసి గ్యాలరీలో ఉన్న ఆయన భార్య రితిక తెగ మురిసిపోయింది. అతడు డబుల్‌ సెంచరీ చేయగానే ఒకింత భావోద్వేగానికి లోనైంది. ఆనంద బాష్పాలు రాల్చింది. లేచి నిల్చుని చప్పట్లతో భర్తను అభినందించింది.
వన్డేల్లో మూడో డబుల్‌ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించిన రోహిత్‌శర్మ తన ఆనందాన్ని మైదానం నుంచే భార్య రితికతో పంచుకున్నాడు. రితికకు గాల్లో ముద్దులు విసిరాడు. అన్నట్లు రోహిత్‌ జీవితంలో ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు రోహిత్‌ రెండో పెళ్లిరోజు. 2015 డిసెంబర్‌ 13న రోహిత్‌ తన మేనేజర్‌ అయిన రితికను వివాహం చేసుకున్నాడు.
ఈ వన్డేలో భారత్‌ శ్రీలంకకు 393 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 208 పరుగులతో అజేయంగా నిలవగా.. శిఖర్‌ ధావన్‌ 68, శ్రేయస్‌ అయ్యర్‌ 88 పరుగులతో రోహిత్‌కు సహకారం అందించారు. ఈ వన్డేలో రోహిత్‌ 13 ఫోర్లు, 12 సిక్స్‌లతో దుమ్మురేపాడు.

No comments:

Post a Comment